కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. చాలా మంది కరోనా భయంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజాగా తనకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో అనవసర ఆందోళన పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన  నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

రెంజల్‌ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్‌ (30) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్‌. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడు. కరోనా లక్షణాలుగా భావించి తన భార్య లక్ష్మి, తల్లి గంగామణి, తమ్ము డు గంగాధర్‌తో కలసి ఆదివారం రెంజల్‌ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. టెస్టు చేయించుకున్న అశోక్‌ నీరసంగా ఉందని పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి తల్లి, భార్యతో కలసి కూర్చున్నాడు. 

తరచూ కోవిడ్‌వార్తలు వింటున్న ఆయన పరీక్ష ఫలితం రాకముందే తనకున్న లక్షణాలను బట్టి కోవిడ్‌ వచ్చిందేమోనని తీవ్ర భయాందోళనకు లోనయ్యాడు. దీంతో ఆయన అక్కడిక్కకే కిందే కుప్ప కూలిపోయాడు. కాగా, అనంతరం వచ్చిన కరోనా పరీక్ష ఫలితాల్లో నెగెటివ్‌ అని తేలింది.