వరంగల్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌కుమార్‌పై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై హస్తం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీస్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. 

డీజీపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరంగల్‌ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించగా.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎన్ఎస్‌యూఐ నేత బల్మూర్ వెంకట్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా.. వరంగల్‌ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌కుమార్‌పై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన పవన్.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్‌ను ఈ రోజు ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు.. ఆస్పత్రికి చేరుకుని పవన్‌ను పరామర్శించారు. పవన్‌ ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక, పవన్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించే విషయంలో కూడా నిర్ణయం తీసుకోనున్నారు. 

ALso REad: హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నేతపై దాడి.. ఎమ్మెల్యే అనుచరుల పనేనని ఆరోపణలు.. టెన్షన్ వాతావరణం..

అసలేం జరిగిందంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం రోజున హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రేవంత్ సభ ముగిసిన సమయంలో పవన్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయి ఉన్న పవన్‌ను పార్టీ సహచరులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పవన్ తలకు, పొట్టకు తీవ్ర గాయాలయ్యాయని.. అయితే పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

అయితే వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పవన్‌పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ‘‘తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌ కార్యకర్త తోట పవన్‌పై అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేశారు. కేసీఆర్ పాలనకు రౌడీయిజం పర్యాయపదంగా మారింది. కాంగ్రెస్‌పై జరిగిన ఈ అమానవీయ, క్రూరమైన దాడి తెలంగాణలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ ఎంతగా భయపడిందో చూపిస్తోంది’’ అని యూత్ కాంగ్రెస్ పేర్కొంది.