Asianet News TeluguAsianet News Telugu

హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నేతపై దాడి.. ఎమ్మెల్యే అనుచరుల పనేనని ఆరోపణలు.. టెన్షన్ వాతావరణం..

వరంగల్‌ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌కుమార్‌పై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన పవన్.. ప్రస్తుతం  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Youth Congress leader Thota Pavan attacked by miscreants in Hanmakonda
Author
First Published Feb 21, 2023, 11:59 AM IST

వరంగల్‌ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌కుమార్‌పై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన పవన్.. ప్రస్తుతం  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్‌ను ఈ రోజు ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు.. ఆస్పత్రికి చేరుకుని పవన్‌ను పరామర్శించారు. పవన్‌ ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక, పవన్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించే విషయంలో కూడా నిర్ణయం తీసుకోనున్నారు. 

అసలేం జరిగిందంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం రోజున హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రేవంత్ సభ ముగిసిన సమయంలో పవన్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయి ఉన్న పవన్‌ను పార్టీ సహచరులు వెంటనే సమీపంలోని  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పవన్ తలకు, పొట్టకు తీవ్ర గాయాలయ్యాయని.. అయితే పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

 

అయితే వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పవన్‌పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ‘‘తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌ కార్యకర్త తోట పవన్‌పై అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేశారు. కేసీఆర్ పాలనకు రౌడీయిజం పర్యాయపదంగా మారింది. కాంగ్రెస్‌పై జరిగిన ఈ అమానవీయ, క్రూరమైన దాడి తెలంగాణలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ ఎంతగా భయపడిందో చూపిస్తోంది’’ అని యూత్ కాంగ్రెస్ పేర్కొంది. 

ఇక, ఈ ఘటనపై పవన్ తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హన్మకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా సేకరించారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు.. పవన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పవన్‌పై దాడి వెనుక వినయ్ భాస్కర్ హస్తం ఉందని వారు ఆరోపించారు. వినయ్ భాస్కర్‌ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. 

ఈ క్రమంలోనే ఆస్పత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. నలుగురు నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios