మద్యానికి బానిసగా మారిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా.. చనిపోవడానికి ముందు ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలని రాసి తన భార్యకు ఇచ్చి.. ఆ తర్వాత ఉరివేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన బండారి రాజు(34) ఎలక్ర్టిషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల రాజు మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల క్రితం రాజు భార్య తులసి కేసముద్రంలోని తల్లిగారింటికి ఓ  కార్యానికి  హాజరయ్యేందుకు ఇద్దరు పిల్లలతో వెళ్లింది. శుక్రవారం రాత్రి మద్యం  సేవించి ఇంటికి వచ్చిన రాజు వైర్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. 

శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు భార్యకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా, రాజు తనకు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇవ్వాలో ఓ చీటిపై రాసి ఈ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవాలని భార్యకు గుడ్‌బై చెబుతూ  సూసైడ్‌ నోట్‌ రాసాడు. ఇదిలావుండగా కొన్నేళ్ల క్రితం రాజు తండ్రి సత్యనారాయణ సైతం ఉరి వేసుకోవడం విచారకం.