జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని వీడియో తీసి ముందుగా ఫ్రెండ్ కి పంపించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

చంపాపేట నెహ్రూనగర్‌కు చెందిన బి. గోపాల్‌ కుమారుడు శ్రీకాంత్‌(21) సాగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోగల మల్లికార్జుననగర్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. గురువారం రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి భవనం వద్దకు వెళ్లాడు. జీవితం విరక్తి కలిగిందని రేకుల గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌ రాడ్‌కు ఉరేసుకొంటూ వీడియో తీసి  తన స్నేహితుడు ముదుగుల శ్రీకాంత్‌కు పోస్ట్‌ చేశాడు. 

అది చూసిన మాదుగుల శ్రీకాంత్  షాకయ్యాడు. ఆ రోజు రాత్రి 11.40 గంటల నుంచి పలుమార్లు ఫోన్‌ చేసినా బి. శ్రీకాంత్‌ నుంచి సమాధానం రాలేదు. అనుమానంతో అర్ధరాత్రి 12.30 గంటలకు స్నేహితుడు అతడి గది వద్దకు వెళ్లాడు. పిలిచినా తలుపులు తీయకపోవడంతో పనివారితో కలిసి బలవంతంగా తెరిచి చూడగా బి. శ్రీకాంత్‌ ఉరేసుకొని వేలాడుతూ ఉన్నాడు. 

 అక్కడే పనిచేస్తున్న శివకుమార్‌ మృతుడి తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం ఉదయం ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.