ఆన్ లైన్ లో చూసి.. గన్ తయారు చేశాడు

youth arrested for making gun and firing
Highlights

గాల్లోకి కాల్పులు.. అరెస్ట్

ఇంటర్నెట్ ని ఉపయోగించి ఏదైనా సాధ్యం చేయవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. కాకపోతే.. ఆ పనే అతనిని కటకటాల వెనకకు తోసేసింది.  ఓ యువకుడు ఇంటర్నెట్ లో చూసి నాటు తుపాకీ తయారు చేశాడు. అనంతరం తుపాకీ పనితీరు చెక్ చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపాడు. అంతే ఇంకే ముంది విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

తూప్రాన్‌ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపిన వివరాల మేరకు..విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూర్‌కు చెందిన మార్దాన రమేశ్‌(26) ఐటీఐ పూర్తి చేశాడు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి పంచాయతీ పరిధి పాలట శివారులోని ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. 

పరిశ్రమలో ఉండే ఇనుప పరికరాలతో నాటు తుపాకీని తయారు చేయాలనుకున్నాడు. అంతర్జాలంలోని వీడియోల ఆధారంగా నాటుతుపాకీతోపాటు తూటాలనూ తయారు చేశాడు. నాలుగు రోజుల క్రితం అతను ఉంటున్న గది పక్కన ఒక రౌండ్‌ గోడకు కాల్పులు జరిపి తుపాకీ పని తీరును గమనించాడు.

 ఆదివారం మద్యం మత్తులో పట్టణంలోని ఓ కల్లు దుకాణం వద్ద తుపాకీని నేలకు పెట్టి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతోపాటు మూడు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పందులను వేటాడేందుకు తుపాకీని తయారు చేశానని విచారణలో రమేశ్‌ చెప్పినట్లు డీఎస్పీ తెలిపారు.

loader