తల్లిదండ్రులను కోల్పోయిన అమ్మాయి ఆలనా పాలనా చూస్తూ ఆమెకు అండగా నిలవాల్సిందిపోయి ఆ అబాగ్యురాలిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని చూశాడో కేటుగాడు. వ్యభిచార గృహానికి అమ్మేయడంతో ఆ యువతిని పోలీసులు రక్షించారు.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన 20 సంవత్సరాల యువతి తల్లిదండ్రులు మృతిచెందారు. ఈ సమయంలో ఆ యువతిని చదివించి తీర్చిదిద్దుతామని మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి తీసుకెళ్లారు.

Also Read:తల్లి రెండో పెళ్లి.. అన్న ఇంటికి వెళితే.. వదిన కాలనాగులా..

అనంతరం ఆ యువతిని అమ్మేశారు. ఎన్నిరోజులు గడిచినా ఆ యువతి ఇంటికి రాకపోవడంతో బంధువులు బెల్లంపల్లి పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో ఇటీవల బాధితురాలు తన మామయ్యకు ఫోన్ చేసి తాను సిరిసిల్లలో ఉన్నట్లు సమాచారం అందించింది. దీంతో అతను పోలీసులకు విషయం చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు సిరిసిల్ల ప్రేమ్ నగర్‌లోని వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి, బాధిత యువతిని రక్షించారు.