26 ఏళ్ల యువ సాప్ట్ వేర్ సడన్ గా గుండెపోటుకు గురయి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి.సంపూర్ణ ఆరోగ్యంగా వున్నవారు సైతం హటాత్తుగా గుండెపోటుకు గురయి చనిపోతున్నారు. చిన్న వయసులోనే గుండెపోటుకు గురయి చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయి ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లాలోని మల్లవరం గ్రామానికి చెందిన మణికంఠ హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సోదరుడు వెంకటేష్ తో కలిసి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ హాస్టల్లో వుంటున్నాడు. రోజూ ఉద్యోగ పనులతో బిజిగా వుండే మణికంఠ(26) వీకెండ్ లో మాత్రం స్నేహితులతో సరదగా గడిపేవాడు. సోదరుడితో పాటు కొంతమంది స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు హైదరాబాద్ శివారులో మహేశ్వరంలోని ఓ గ్రౌండ్ కు వెళ్లేవాడు. నిన్న (శనివారం) కూడా ఇలాగే క్రికెట్ ఆడేందుకు వెళ్ళాడు.
క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పిగా వుండటంతో మైదానాన్ని వీడిన మణికంఠ కారులో విశ్రాంతి తీసుకున్నాడు. మ్యాచ్ ముంగించుకుని వచ్చిన స్నేహితులు ఎంతపిలిచినా పలకకపోవడంతో వారు కంగారుపడిపోయారు. దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్ళగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటుతోనే మణికంఠ చనిపోయివుంటాడని... పోస్టుమార్టం తర్వాతే అతడి మృతికి గల కారణం తెలుస్తుందని డాక్టర్లు తెలిపారు.
Read More సంగారెడ్డి జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడి.. !
మృతుడు మణికంఠ సోదరుడు వెంకటేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు మహేశ్వరం పోలీసులు.
కొడుకు మరణవార్త విని మణికంఠ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం వెళ్లి ఇలా శవంగా తీరిగివస్తున్నావా అంటూ కొడుకును తలచుకుంటూ కన్నవారి ఏడుపు చూసేవారితోనూ కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే ఉస్మానియాకు చేరుకున్న మణికంఠ కుటుంబసభ్యులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
