జిమ్ నుంచి వచ్చిన కాసేపటికి గుండెపోటు.. వాంతులు చేసుకుని యువకుడు మృతి..
ఓ యువకుడు జిమ్ నుంచి వచ్చిన కాసేపటికి గుండెపోటుకు గురయ్యాడు. అది మామూలు నొప్పే అనుకుని వాకింగ్ చేస్తూ.. కుప్పకూలిపోయి మృతి చెందాడు.
మహబూబ్ నగర్ : ఇటీవల కాలంలో సడన్ గా గుండెపోటు వచ్చి మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనే తాజాగా వెలుగు చూసింది. అప్పటివరకు జిమ్ చేసుకొని ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్నేహితులు, స్థానికులు చెప్పిన కథనాలు ఈ మేరకు ఉన్నాయి.. మృతుడు మాజీద్ హుస్సేన్ షోయబ్ అలియాస్ జున్ను (23) మహబూబ్నగర్ పట్టణం రామయ్య బౌలిలో నివాసం ఉంటున్నాడు.
మున్సిపల్ ఆఫీస్ కు సంబంధించి కొలతలు తదితర పనులకు రోజువారి వేతనం మీద వెళ్లేవాడు. మాజీద్ నిత్యం జిమ్ కు వెళ్తుండేవాడు. ప్రతిరోజులాగే గురువారం రాత్రి కూడా న్యూటన్ ప్రాంతంలో ఉన్న ఓ జిమ్ కు వెళ్లి రాత్రి 8 గంటల వరకు వ్యాయామం చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో అతనికి ఛాతిలో నొప్పి వచ్చింది. వాంతులు కూడా అయ్యాయి. అయితే, మాజిద్ దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. మామూలేనని అనుకుని ఇంటిముందు వాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో గుండెపోటు తీవ్రమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు,
ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ కేసుగా తీసుకుని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందాడని తెలిపారు. 23 ఏళ్ల చిన్న వయసులోనే ఇలా గుండెపోటుకు బలవడం అందరిని కలిసివేసింది. అతని మరణంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీనికి సంబంధించి వన్ టౌన్ పోలీసులు వివరాలు తెలుపుతూ.. జిమ్ నుంచి వచ్చి ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడని తెలిసిందని కానీ దీని మీద తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.