పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించి మద్యం తాగిన వాళ్లపై కేసులు నమోదు చెయ్యడం చూశాం. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై కేసు పెట్టి హల్ చల్ చేశాడు ఓ యువకుడు. 

హైదరాబాద్: పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించి మద్యం తాగిన వాళ్లపై కేసులు నమోదు చెయ్యడం చూశాం. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై కేసు పెట్టి హల్ చల్ చేశాడు ఓ యువకుడు. పోలీసులు అర్థరాత్రి సుల్తాన్‌బజార్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. 

సయ్యద్‌ జహంగీర్‌ అనే వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌ చేశారు. అయితే 43శాతం మద్యం తాగినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తేల్చారు. తాను మద్యం తాగలేదని జహంగీర్‌ ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమతోనే వాగ్వాదంతో దిగుతావా...మిషన్ తప్పు చెప్తుందా అంటూ పోలీసులు జహంగీర్‌పై కేసు నమోదు చేశారు. 

అయితే తాను మద్యం తాగకపోయినా తాగానని....తనపై కేసు పెట్టడంతో జహంగీర్ ట్రాఫిక్‌ పోలీసులపై సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం సయ్యద్‌ జహంగీర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జహంగీర్‌ మద్యం తాగలేదని వైద్యులు నిర్ధారించారు. 

జహంగీర్ మద్యం తాగలేదని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే బాధితుడు ఫిర్యాదు మేరకు ఎలాంటి చర్యలు ఉంటాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.