హైదరాబాద్:తాను ప్రేమించిన వ్యక్తిని  పెళ్లి చేసుకోకుండా తండ్రి అడ్డుకొంటున్నాడని ఓ యువతి తన తండ్రిపై  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రియుడిపై పలు మార్లు దాడి చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొంది.ప్రేమించిన యువకుడినే  పెళ్లి చేసుకొంటానని  ఆ యువతి పోలీసులకు తెగేసి చెప్పింది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన  ఓ వ్యక్తి  హైద్రాబాద్ వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. అతను హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడు. అతని కూతురు  మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటకు చెందిన  సాయి దీక్షిత్‌గౌడ్‌ను తొమ్మిదో తరగతి నుండే ప్రేమిస్తోంది.  వీరిద్దరూ  గతంలో రెండు దఫాలు ఇంటి నుండి పారిపోయారు.

దీంతో యువతి తండ్రి  సాయిదీక్షిత్‌పై  కిడ్నాప్ కేసు పెట్టాడు. రెండు దఫాలు సాయి దీక్షిత్ జైలుకెళ్లి వచ్చాడు. అయితే  మహబూబ్‌నగర్ నుండి ఆ యువతి కుటుంబం హైద్రాబాద్‌కు వచ్చి స్థిరపడింది.తన కూతురుకు  ఆయన  పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.  

తాను చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని తనను బెదిరించి ఇంట్లో నిర్భంధించినట్టుగా  బాధితురాలు  ఆరోపిస్తున్నారు.  ఈ మేరకు ఈ నెల 20వ తేదీన  బాధితురాలు పోలీసులను  ఆశ్రయించింది.తన తండ్రి తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాదు తన లవర్ సాయిదీక్షిత్‌ను  తన తండ్రి హత్య చేయించే అవకాశం కూడ ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అంతేకాదు గతంలో సాయిపై దాడికి పాల్పడిన విషయాన్ని ఆమె పోలీసులకు వివరించింది.