ఖమ్మం: గుప్తనిధుల కోసం కుటుంబసభ్యులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఆ ఇంటికి చెందిన యువతి కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుప్తనిధుల కోసం చేపట్టిన క్షుద్రపూజల్లో కొంపతీసి యువతిని నరబలి ఏమయినా ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఎర్రుపాలెం మండలం రేమిడిచెర్ల గ్రామానికి చెందిన వెల్లంకి వెంకట్రావు,రాణి దంపతుల కుమార్తె రాజశ్రీ (16). ఈమె చదువుకునేందుకు వరంగల్‌లో తన బాబాయి వెల్లంకి నాగేశ్వరరావు వద్ద ఉంటోంది. 

అయితే ఇటీవల నాగేశ్వరరావు మామ నర్సింహారావు ఇంట్లో గుప్తనిధులు వున్నట్లు... ఆ నిధులు వశమవ్వాలంటే రాజశ్రీ చేత పూజలు చేయించాలని కొందరు మంత్రగాల్లు తెలిపారట. దీంతో యువతి తల్లిదండ్రులు,బాబాయ్ అనుమతితో నర్సింమారావు రాజశ్రీతో క్షుద్రపూజలు చేయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల యువతి కనిపించకుండా పోయింది. 

దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు యువతి గదిలో వెతకగా ఓ లెటర్ లభించింది.తనకు ఉన్నత చదువులు చదువుకోవాల్సి వుందని...అందుకోసమే ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు లేఖ రాసివుంది. కానీ క్షుద్రపూజలు జరుగుతున్న సమయంలో యువతి కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యువతిని క్షుద్రపూజల్లో భాగంగా ఏమయినా అపాయం తలపెట్టారా? లేక నిజంగానే ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది.