ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఆత్మహత్య పై పోలీసుల కంటే ముందుగానే మృతురాలి చెల్లెలు ఆధారాలను సేకరించింది. అక్క ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని పోలీసులకు పట్టించింది.  ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్  మెట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది.

నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన పాపారావు ఉపాధి కోసం కుటంబంతో సహా హైదరాబాద్ కు వలస వచ్చి నేరేడ్ మెట్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇతడికి తనూజ, రూప ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఓ కిరాణా షాప్ ను నిర్వహిస్తూ ఇతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

పెద్ద కూతురు నర్సింగ్ పూర్తి చేసి కిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈమెకు నెల్లూరు జిల్లాకు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే తనూజ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చేసరికి వినయ్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తనూజ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.

అయితే ఈ ఆత్మహత్యపై నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి కంటే ముందే మృతురాలి చెల్లి రూప ఈ కేసును చేధించింది. తన అక్క తనూజ. వినయ్ కుమార్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, మెసేజ్ లతో కూడిన 250 పేజీల సమాచారాన్ని సేకరించింది. దీన్ని పోలీసులకు అప్పగించి  వినయ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.