వరంగల్: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలోనే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా  జరుపుకున్న అన్నదమ్ములు బైక్ పై ఇంటికివెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. 

వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్సీకాలనీకి చెందిన ఐత శ్రీకాంత్(23), ఐత శ్రీశాంత్(16) అన్నదమ్ములు. వీరు అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితులుగా మెలిగేవారు. అయితే వీరిద్దరు స్నేహితులతో కలిసి గురువారం రాత్రి న్యూ ఇయర్ వేడులకు జరుపుకున్నారు. అర్థరాత్రి వరకు సంబరాలు జరునుకుని బైక్ పై ఇంటికి బయలుదేరారు.

అయితే వారు మద్యం సేవించి బైక్ ను నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కనున్న ఓ చెట్టుకు ఢీకొట్టింది. దీంతో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో యువకుడు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని... పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నదమ్ముల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.