ముథోల్: దేశ రక్షణలో తానుకూడా ముందుండి పోరాడి వీరసైనికుడిలా పేరుతెచ్చుకోవాలన్న యువకుడు కలగన్నాడు. ఇందుకోసం ఇండియన్ ఆర్మీలో చేరాలని ప్రయత్నించాడు. కానీ ఆర్మీ ఉద్యోగానికి తాను సరిపోనని తెలియడంతో తీవ్ర మనస్థానికి గురయిన అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. దేశసేవకు పనికిరాని ఈ శరీరం తనకు వద్దని భావించాడో ఏమోగాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ముథోల్‌ మండలంలోని కుభీర్‌ గ్రామానికి చెందిన శంకర్‌–అనిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. వీరి పెద్ద కొడుకు జిట్ట ప్రవీణ్‌ (24) డిగ్రీ మధ్యలో చదువు ఆపేసి ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆర్మీ  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడంతో స్నేహితులతో కలిసి ప్రవీణ్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. 

ఈ క్రమంలో మంచి సాధన కోసం కోచింగ్ తీసుకోవాలని ప్రవీణ్ భావించాడు. ఇందుకోసం కరీంనగర్‌లో ఆర్మీ ఎంపికకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌కు ప్రవీణ్‌ ఫోన్‌ చేశాడు. అయితే వారు ఆర్మీ ఉద్యోగానికి కావాల్సిన శారీరక కొలతల గురించి ప్రవీణ్ కు వివరించారు. ఆ కొలతలు తనకు సరిపోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ప్రవీణ్ దారుణానికి ఒడిగట్టాడు. 

ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ప్రవీణ్‌ మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.