కొత్తగూడెం: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే వున్నాయి. అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులనూ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఇలా ఓ యువకుడు నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన గణేష్‌ అలియాస్‌ చింటూ(20) గమనించాడు. ఈ పాపకు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 

లైంగిక దాడి అనంతరం ఏడుచుకుంటూ ఇంటికి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో ఈ అఘాయిత్యంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టంతో పాటు వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేసి యువకున్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను కూడా వైద్యపరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.