కేవలం వెయ్యి రూపాయిల కోసం అవమానం... భరించలేక డిగ్రీ స్టూడెంట్ సూసైడ్
తోటి యువకులు దొంగతనం నిందవేసి అవమాానించడంతో తట్టుకోలేకపోయిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మంచిర్యాల : కేవలం వెయ్యి రూపాయిల కోసం డిగ్రీ విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తోటి విద్యార్థులు దొంగతనం నింద వేయడంతో భరించలేకపోయిన యువకుడు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగాడు. తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన కామెర ప్రభాస్(20) మంచిర్యాలలోని సివి రామన్ కాలేజీలో చదువుకుంటున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అతడు ఎస్సీ భాయ్స్ హాస్టల్లో వుంటున్నాడు.
అయితే ఇటీవల హాస్టల్లో కొందరు విద్యార్థుల డబ్బులు పోయాయి. ప్రభాస్ ఈ ఈ డబ్బులు తీసివుంటాడని అనుమానించారు. అతడు కాలేజీకి వెళ్ళిన సమయంలో బ్యాగ్ తనిఖీ చేయగా వెయ్యి రూపాయలు దొరికాయి. ఇవి తమ డబ్బులే అయివుంటాయని భావించిన విద్యార్థులు తీసేసుకున్నారు. కాలేజీ నుండి వచ్చిన ప్రభాస్ బ్యాగులో డబ్బులు లేకపోవడంతో తోటి విద్యార్థులను ప్రశ్నించాడు. ఆ డబ్బులు తమవేనని... దొంగతన చేసి దాచుకున్నావంటూ నింద వేసారు. తాను దొంగతనం చేయలేదని అతడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. బ్యాగులోని డబ్బులు తనవేనని నిరూపించుకోవాలని... అలాగైతేనే తిరిగి ఇస్తామని సూచించారు.
Read More నీవు లేక నేను బతకలేనని.. ప్రాణ స్నేహితుడి ఆత్మహత్యను తట్టుకోలేక యువకుడి బలవన్మరణం..
అయితే బ్యాగులోని డబ్బులు తనవేనని నిరూపించాలని ప్రయత్నించిన ప్రభాస్ విఫలమయ్యాడు. దీంతో దొంగతనం చేయడమే కాదు అబద్దాలు అడుతున్నట్లు తోటి యువకులు నిందలు వేయడాన్ని ప్రభాస్ తట్టుకోలేకపోయాడు. దీంతో ఇటీవల హాస్టల్ నుండి స్వగ్రామం జోగాపూర్ కు వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న అతడు వెంటతెచ్చుకున్న శీతల పానియంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయిన అతడికి కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
తన బిడ్డి బాగా చదువుకుని గౌరవంగా బ్రతుకుతాడన్న ఆశపడ్డామని... కానీ ఇలా అవమానభారంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఊహించలేమంటూ ప్రభాస్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలంటూ హాస్పిటల్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)