హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కేటీఆర్ ఆయనకు టీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి సాదరగంగా ఆహ్వానించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల సూచనల మేరకు తాను టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సురేందర్ తెలిపారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు దూరమైందని, పార్టీలో అంతా ఒంటెద్దు పోకడలతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలోకి వచ్చానని ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్నానని తెలిపారు. మళ్లీ ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. 

వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి నడుస్తానని ప్రకటించారు. నియోజకవర్గాన్ని, కామారెడ్డి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తోందని ప్రశంసించారు. 

ఇకపోతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా జాజుల సురేందర్ కూడా కారెక్కేశారు. మెుత్తం పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి, చిత్తరంజన్ దాస్ లు కూడా త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.