ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. తిర్యాణి మండలంలోని గిన్నెధరలో, భీంపూర్ మండలంలోని అర్లి టీలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజంతా శీతల గాలులు వీస్తున్నాయి. 

శీతాకాలం త‌న ప్ర‌భావం చూపిస్తోంది. ప‌ది రోజుల క్రితం వ‌ర‌కు మామూలుగానే ఉన్న ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క సారిగా ప‌డిపోయాయి. విప‌రీతంగా చ‌ల్ల‌గాలులు వీస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే తెలంగాణ‌లోని ఉమ్మ‌డి అదిలాబాద్ జిల్లాలో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. తెలంగాణ‌లోని ఈ జిల్లాలోనే అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌వుతున్నాయి. 

గిన్నెధ‌రిలో 3.5 డిగ్రీలు..
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని తిర్యాణి మండ‌లం గిన్నెధ‌రిలో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఇక్క‌డ మంగ‌ళ‌వారం నాడు కేవ‌లం 3.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. గ‌త ప‌ది రోజుల నుంచి ఇక్క‌డ అతి త‌క్కువ ఉష్ణోగ్ర‌త న‌మోద‌వుతున్నాయి. దీంతో ఆ గ్రామం చ‌లితో గ‌జ గ‌జ వ‌ణుకుతోంది. అతి శీత‌ల గాలులు వీస్తున్నాయి. తెలంగాణాలోనే ఇది అత్యల్ప ఉష్ణోగ్ర‌త కావ‌డం గ‌మ‌నార్హం. ఎముక‌లు కొరిచే చ‌లిలో ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. తీవ్ర‌మైన పొగ మంచు కురుస్తోంది. ఈ పొగ‌మంచు కార‌ణంగా 8 గంట‌ల వ‌ర‌కు సూర్యుడు క‌నిపించ‌డం లేదు. రోజంతా చ‌లిపెడుతూనే ఉంది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు శీత‌ల గాలులు వీస్తున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే గ్రామంలో గ‌తేడాది 2 డిగ్రీల చ‌లి న‌మోదైంది. ఈ ఏడాది కూడా మ‌రో వారం రోజుల్లో ఇక్క‌డ అత్య‌ల్ప చ‌లి న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. 

ములుగు జిల్లాలో దారుణం: మాజీ సర్పంచ్ రమేష్ హత్య చేసిన మావోయిస్టులు

అర్లి (టి)లోనూ ఆదే ప‌రిస్థితి..
ఇదే జిల్లాలోని మ‌రో గ్రామం ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండ‌లం అర్టి (టి) గ్రామంలోనూ చ‌లి తీవ్రంగా ఉంది. ఇక్క‌డ కూడా ప్ర‌తీ రోజు 3.9 డిగ్రీలు, 3.5 డిగ్రీల చ‌లి న‌మోద‌వుతోంది. ద‌ట్ట‌మైన పొగ‌మంచు పేరుకుపోతోంది. ఉద‌యం, రాత్రి వేళ్ల‌ల్లో చ‌ల్ల‌టి గాలులు వీస్తున్నాయి. చ‌లికి త‌ట్టుకోలేక ఉద‌యం 8.30 గంట‌ల వ‌ర‌కు ఇంట్లో నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. సాయంత్రం 5 త‌రువాత రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎక్క‌డ చూసినా చ‌లి మంట‌లు క‌నిపిస్తున్నాయి. ప‌దో త‌ర‌గతి విద్యార్థుల కోసం నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక త‌రగ‌తులకు చ‌లి తీవ్ర‌త వ‌ల్ల ఎవ‌రూ హాజ‌రుకావ‌డం లేదు. మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప్ర‌త్యేక త‌ర‌గ‌తికి కేవ‌లం ఇద్ద‌రు విద్యార్థులు మాత్ర‌మే వ‌చ్చారు. వారికి కూడా స్కూల్ ప్రాంగ‌ణంలోని మైదానంలో ఎండ‌లో కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. ఇక్క‌డ గ‌తేడాది డిసెంబ‌ర్ చివ‌రి వారంలో తెలంగాణ‌లోనే అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఇక్క‌డ వీచే చ‌ల్ల‌గాలుల వ‌ల్ల వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గుర‌వుతున్నారు. గ‌తేడాది క‌లెక్ట‌ర్ దివ్యా దేవ‌రాజ‌న్ ఈ గ్రామాన్ని సంద‌ర్శించి వృద్ధుల‌కు దుప్ప‌ట్లు పంపిణీ చేశారు. ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా వ‌చ్చి చ‌లి నుంచి రక్షించుకునే దుస్తులను అంద‌జేశాయి. 

వరి ధాన్యం ఇష్యూ: తెలంగాణ మంత్రులపై పీయూష్ వ్యాఖ్యలు... క్షమాపణకు హరీష్ రావు

జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ప‌రిధిలో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అత్య‌వ‌స‌రం అయితేనే రాత్రి, ఉద‌యం వేళల్లో బ‌య‌ట‌కు వెళ్లాల‌ని చెబుతున్నారు. చ‌లి నుంచే ర‌క్ష‌ణ‌నిచ్చే దుస్తులు ధ‌రించాల‌ని సూచిస్తున్నారు. గోరు వెచ్చ‌టి నీళ్లు, వేడి వేడి ఆహారం తీసుకోవ‌డం ద్వారా చ‌లి వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొంత వ‌ర‌కు దూరం చేసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.