తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఈ రోజు రాత్రి యాద్రాద్రికి (Yadadri) చేరుకోనున్నారు. సోమవారం యాదాద్రిలో జరిగే మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఈ రోజు రాత్రి యాద్రాద్రికి (Yadadri) చేరుకోనున్నారు. రాత్రికి సీఎం కేసీఆర్ కుటుంబం అక్కడే బస చేయనుంది. సోమవారం యాదాద్రిలో జరిగే మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మహా పర్వం మొదలు కానుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. దీంతో యాదాద్రిలో ఆధ్మాత్మిక శోభ ఉట్టి పడుతోంది. యాదాద్రి మూలమూర్తుల దర్శనభాగ్యం కోసం చూస్తున్న చూడాలన్న భక్తుల ఏడేళ్ల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. 

ఇక, యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా నేడు 7వ రోజు పంచకుండాత్మక యాగాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, మూల మంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారయాణం, మూలమంత్ర హావనములు, చతు:స్థానార్చనలు, షోడశ కళాన్యాసహోమములు, పంచశయ్యధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించారు. నేటితో బాలాలయంలో భక్తులకు దర్శనాలు ముగియనున్నాయి. 

రేపు యాదాద్రి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ జరుగనుంది. సోమవారం ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9:30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11:55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ, తదితర వైదిక కార్యక్రమాలుంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభువుల దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం రూ.1280 కోట్లతో యాదాద్రి పునఃనిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. ఆలయ పునఃనిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అద్భుత శైలిలో యాదాద్రిని పునః నిర్మించారు. 2015లో పునః నిర్మాణాన్ని మొదలు పెట్టగా ఇటీవలే నిర్మాణం పూర్తైంది.