హైదరాబాద్:తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం నాడు కలిశారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేరే పార్టీలో చేరుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఈ ప్రచారాన్ని ప్రారంభించారని ఆయన ఆరోపించారు.  టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్ని ఈ ప్రచారం చేశాయని ఉత్తమ్ చెప్పారు.

కేరళలో ఇలాగే జరిగితే గెలిచిన అభ్యర్ధిని కోర్టు అనర్హుడిగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓటమి భయంతోనే తమ పార్టీ అభ్యర్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మండిపడ్డారు.

also read:అదంతా తప్పుడు ప్రచారం: చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై వదంతులను ఖండించిన ఉత్తమ్

దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత టీఆర్ఎస్ నుండి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు, టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. 

ఈ ఎన్నికను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న విషయం తెలిసిందే.