శిరీష మరణంపై అనేక అనుమానాలు, అనేక సవాళ్లు ముందుకొస్తున్నాయి. అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు ఆమెది ముమ్మాటికీ ఆత్మహత్యే అని ప్రకటించారు. ఇటు నిందితులైన శ్రావణ్, రాజీవ్ ల నుంచి పూర్తి వివరాలను రాబట్టారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ చేయకముందు వారి నుంచి సమాచారం సేకరించారు. ఆ తర్వాత వారిని రెండు  రోజుల పాటు కస్టడీకి తీసుకుని మరీ విచారణ జరిపారు. మరోవైపు శిరీష పోస్టుమార్టం రిపోర్టును కూడా పోలీసులు సేకరించారు. ఇవన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆమెది ఆత్మహత్య అన్నది ధృవీకరించుకున్నారు. అదే విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నారు పోలీసులు.

 

ఇక శిరీష కుటుంబసభ్యులు మాత్రం తమ అనుమానాలను ఇంకా వెల్లడిస్తూనే ఉన్నారు. శిరీషను హత్య చేశారని వారు పదే పదే చెబుతున్నారు. పోలీసులపైనా వారు అనుమానాలువ్యక్తం చేస్తున్నారు.  నిందితులను తప్పించేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. దీనికితోడు వారు పలు సాంకేతిక అంశాలను సైతం లేవనెత్తుతున్నారు. శిరీషపై అత్యాచారం చేసి హత్య చేశారని కూడా ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

 

నిజానికి శిరీషపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.  దీన్ని చేధించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. మొదట కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న వెంటనే పోలీసులు ఒక లీక్ వదిలారు. శిరీషను రేప్ చేశాడని, ఆ వివరాలు బయటకు వస్తాయన్న భయంతోనే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు పెద్దలు కొందరు ప్రచారం చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. తర్వాత పోలీసులు వ్యూహం మార్చారు. రేప్ జరిగిందా, లేదా అన్నది తేల్చాల్సి ఉందంటూ మాట మార్చారు.

 

మరోవైపు శిరీష లోదుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయన్న వివరాలు బయటకొచ్చాయి. దీంతో శిరీష దుస్తులను, ఇతర ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ఫొరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే శిరీషపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది తేలనుంది. మరోవైపు అత్యాచార యత్నం జరిగిన విషయంలోనూ  ఆ నివేదిక వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

 

వెస్ట్ జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘శిరీషది ముమ్మాటికీ ఆత్మహత్యే. ఆమె వస్త్రాలతో పాటు ఫోరెన్సిక్‌ డాక్టర్లు సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాం. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఫోరెన్సిక్‌ పరీక్ష రిపోర్ట్‌ వస్తే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలం. కుకునూర్‌పల్లిలో జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నాం’ అని చెప్పారు.

 

ఫొరెన్సిక్ రిపోర్టు రావాలంటే మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నయి. మొత్తానికి శిరీష విషయంలో అత్యాచారం జరిగిందా లేదా అన్నది తేలాలంటే కనీసం రెండు వారాలు ఆగాల్సిందేనని అంటున్నారు.