మీ మాటలు వినడంతో తనకు మేలు జరిగిందని... ప్రతి ఒక్కరికీ ఇలాగే మేలు జరగాలని కోరుకుంటున్నానంటూ సిరిసిల్లకు చెందిన ఓ మహిళ రాసిన లేఖపై మంత్రి హరీష్ రావు స్పందించారు.  

సిరిసిల్ల : తెలంగాణలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందుతోందని... దీంతో సాధారణ ప్రజలు ప్రయోజనం పొందుతున్నారంటూ ఓ సామాన్యుడు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (harish rao) కు లేఖ రాసాడు. తన బిడ్డకు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మంచి వైద్యం అందించి నార్మల్ డెలివరీ చేసారని... తల్లీ బిడ్డ చాలా ఆరోగ్యంగా వున్నారంటూ సిరిసిల్ల జిల్లావాసి లేఖలో పేర్కొన్నాడు. మీరు చెప్పింది విని ధైర్యంగా ప్రభుత్వాస్పత్రికి వెళితే పైసా ఖర్చు లేకుండా సాధారణ ప్రసవం చేసారంటూ పోచయ్య, అతడి కూతురు వసంత మంత్రి హరీష్ కు లేఖద్వారా తెలిపారు. 

హరీష్ కు మహిళ రాసిన లేఖ యధావిధిగా:

"సారు... మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా ఆర్&ఆర్ కాలనీ. కేసీఆర్ సార్ వల్ల మంచిగా వసతులు ఉన్నాయని నా బిడ్డను సిరిసిల్ల గవర్నమెంట్ పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. మా కేటీఆర్ సార్ కూడా ఆసుపత్రిలో మంచి సౌలత్ లు చేసిండు. ఆసుపత్రిలో ఏప్రిల్ 10, 2022 నాడు పురిటి నొప్పులతో బిడ్డ బాధపడుతుంటే మా తమ్మునికి మబ్బుల ఫోన్ చేసిన. సాధారణ కాన్పు అయితే తల్లీ బిడ్డకు మంచిదని సెప్పిండు. కొద్దిగా ఓపిక పట్టుర్రి అని అన్నాడు. అట్టనే అప్పుడప్పుడు టీవిల్లో కూడా మీరు సాధారుణ కాన్పు వల్ల కలిగే మంచి గురించి చెప్పడంతో మేము కూడా ఆసుపత్రి సిబ్బందికి నార్మల్ డెలివరీ చేయమని చెప్పినం. డాక్టర్లు, సిబ్బంది నా బిడ్డకు నార్మల్ డెలివరీ చేసారు. పండంటి మగబిడ్డ పుట్టిండు. బిడ్డ, మనువడు ఆరోగ్యంగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అవడం వల్ల పైసలు ఖర్చు కాలేదు. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు. పైసా తీసుకోకుండా వాహనంలో ఇంట్లో దింపిర్రు. 

కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నాకు... నా బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికీ తెలపాలన్న ఉద్దేశ్యంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నా...సార్. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉన్నాయి. అందరూ కాన్పుల కోసం గవర్నమెంట్ ఆసుపత్రికే రావాలని కోరుుకుంటున్నా. నాకు జరిగిన మేలే అందరికీ జరగాలే అంటూ శామంతుల వసంత పేరిట హరీష్ కు లేఖ వచ్చింది. 

ఈ ఉత్తరంపై మంత్రి హరీష్ స్పందించారు. తనలాగే ప్రతిఒక్కరికీ ప్రభుత్వ వైద్యం అందాలని... ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ కాన్పు చేయించుకుని మేలు పొందాలంటూ సిరిసిల్ల జిల్లావాసి వసంత మంచి సందేశాన్ని ఇస్తూ రాసిన లేఖ తనకు అందిందని అన్నారు. ఈ ఉత్తరం చదువుతుంటే తనకు చాలా ఆనందంగా వుందన్నారు. వసంత నూరు వసంతాలు పిల్లాపాపలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని హరీష్ అన్నారు.

ప్రజల్లో ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు, అందులో అందే వైద్యంపై అనుమానాలను వసంత మాటలు తొలగిస్తాయన్నారు. ఆమె రాసిన ఉత్తరం ప్రజల్లో చైతన్యం కలిగించి స్పూర్తిని ఇచ్చేలా వుందన్నారు. ప్రభుత్వ వైద్యంపై ఆమె వుంచిన నమ్మకాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం అందించే వైద్యసదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.