భర్త మరో మహిళతో అక్రమసంభందం పెట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌తండా మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. 

జడ్చర్ల: కట్టుకున్నవాడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి యువ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌తండాలో చోటుచేసుకుంది. 

వివకరాల్లోకి వెళితే... జడ్చర్ల సమీపంలోని మాచారం గ్రామానికి చెందిన సిరి(28)కి నసురుల్లాబాద్‌తండా నివాసి శ్రీనివాస్ కు పదకొండేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కొడుకులు. పిల్లా పాపలతో అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో అక్రమసంబంధం చిచ్చుపెట్టింది. గ్రామ సర్పంచ్ గా కొనసాగుతున్న సిరిని దూరం పెట్టిన శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 

read more కూకట్‌పల్లి: రెండు నెలల క్రితం పెళ్లి.. భార్యను దారుణంగా చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

భార్యాభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. అయినా భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన సిరి ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత వారం రోజులుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. శనివారం ఆమె మృతదేహాన్ని నసురుల్లాబాద్‌తండాకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. 

మృతురాలి సోదరుడు శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. దీంతో మృతురాలి భర్త శ్రీనివాస్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నసురుల్లాబాద్‌తండా సర్పంచ్‌ సిరి మృతిపై సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాల్‌సుందర్‌ తదతరులు సంతాపం వ్యక్తం చేశారు.