ఆర్టీసీ బస్టాండ్ లోనే ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో  చోటుచేసుకుంది.  కాగా.. ఆమెకు ఆర్టీసీ సిబ్బంది సహకరించి మానవత్వం చాటుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ కి చెందిన మణెమ్మ(33) నిండు గర్భిణి.. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రవసవం కోసం ఆమె తన తల్లితో కలిసి నగరానికి వచ్చింది.  అయితే..వారి వద్ద సరైన ధ్రువ పత్రాలు లేవంటూ.. మణెమ్మను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు.

దీంతో చేసేది లేక ఆదివారం సాయంత్రం మణెమ్మ తల్లితో కలిసి ఎంజీబీఎస్ బస్టాండ్ కి చేరుకుంది. బస్సుకోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. గమనించిన ఆర్టీసీ సిబ్బంది చుట్టూ చీరలు కట్టి.. ఆమెకు ప్రసవ ఏర్పాట్లు చేశారు. ఆమె బస్టాండ్ లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం 108కి కాల్ చేయగా.. వారు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. కల్వకుర్తి ఏడీసీ జీఆర్ రెడ్డి, ఎంజీబీఎస్ కంట్రోలర్లు, సిబ్బంది కొంత నగదు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.