భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నగరంలోని చందానగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి గోపీనగర్‌కి చెందిన నవీన్‌ కుమార్‌ ప్రైవేటు ఉద్యోగి, ఇతడి భార్య వీణ(25). వివాహం జరిగి నాలుగు సంవత్సరాలైంది. వీరికి రెండేళ్ల వయస్సున్న కుమార్తె ఉంది. 

నవీన్‌.. టీవీలో వచ్చే సినిమా హీరోయిన్లను చూపిస్తూ నువ్వు ఆ హీరోయిన్‌లా లేవంటూ సూటిపోటి మాటలతో తరచూ భార్యను వేధించేవాడు. రోజురోజుకు ఈ వేధింపులు తీవ్రరూపం దాల్చడంతో రెండునెలల పాటు కొల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంది. ఇటీవలే వారు ఆమెను తీసుకొచ్చి నవీన్‌కు సర్దిచెప్పారు. తరువాతా అతడిలో మార్పు రాలేదు. 

ఈ క్రమంలో వేధింపులను తట్టుకోలేక ఈనెల 22వతేదీన ఉదయం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగు వారు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతికి కారణమైన భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.