ఈయన కదా అసలైన సూపర్ పోలీస్ ... రోడ్డుపై పరుగెత్తుకుంటూ వెళ్లి ఏసిపికి దండంపెట్టిన మహిళ (వీడియో)

తన ప్రాణాలు కాపాడిన పోలీస్ ను కలిసేందుకు ఓ మహిళ రోడ్డుపైనే పరుగుతీసిన ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

Woman thanks Mahankali ACP Ravinder AKP

సికింద్రాబాద్ : బస్సులోంచి వడివడిగా కిందకు దిగిన  మహిళ రోడ్డుపై పరుగుతీసింది. ఆమెను చూసి ఏమయ్యిందోనని అందరూ అలాగే చూస్తుండిపోయారు. కానీ ఆమె నేరుగా రోడ్డుపై బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి దగ్గరకు వెళ్లింది.ఎప్పటినుండో సదరు పోలీస్ అధికారికి కలిసేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన ఇలా రోడ్డుపై కనిపించడంతో ఆమె ఆగలేకపోయింది. వెంటనే బస్సు దిగి పరుగున వెళ్లి తన ప్రాణాలు కాపాడిన పోలీసును కలుసుకుంది. సదరు మహిళను చూసి పోలీస్ అధికారి కూడా ఆనందం వ్యక్తం చేసారు. ఇలా వీరిద్దరి రోడ్డుపైనే ఆప్యాయంగా మాట్లాడుకోవడం అక్కడున్నవారు ఆసక్తిగా గమనించారు. 

వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం సికింద్రాబాద్ మహంకాళి ఏసిపిగా పనిచేస్తున్న రవీందర్ గతంలో పాతబస్తీ ప్రాంతంలో ఇన్స్పెక్టర్ గా పనిచేసారు. ఇలా టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సమయంలో కార్వాన్ ప్రాంతానికి చెందిన కవితకు సాయం చేసాడు. అనారోగ్యంతో బాధపడుతూ రోడ్డుపై పడిపోయిన మహిళను చూసి చలించిన రవీందర్ ఆమెకు వైద్యం అందించే ఏర్పాటు చేసాడు. హాస్పిటల్ కు తరలించడమే కాదు తన సొంత డబ్బులతో కవితకు ఆపరేషన్ చేయించాడు. 

వీడియో

2014 సంవత్సరంలో ఈ ఘటన జరిగింది. ఆపరేషన్ తర్వాత కోలుకున్న కవిత ప్రాణాలు కాపాడిన రవీందర్ ను కలిసేందుకు ప్రయత్నించింది. కానీ ఆ అవకాశం రాలేదు. అప్పటినుండి ఆమె పోలీస్ అధికారికోసం వెతుకుతూనే వుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఇలా మళ్లీ ఆమె రవీందర్ ను కలవగలిగింది. 

Read More  వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న దిశా కేసు విచారణ అధికాారి.. కారణమిదేనా..?

సికింద్రాబాద్ మీదుగా కవిత బస్సులో వెళుతుండగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బందోబస్తు కోసం రోడ్డుపై వున్న ఏసిపి రవీందర్ ను గుర్తుపట్టింది. వెంటనే బస్సు ఆపి కిందకు దిగిన ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయనను కలిసింది. తన ప్రాణాలు కాపాడిన పోలీసును చూసిన ఆనందంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇవాళ తాను బ్రతికివుండటానికి మీరే కారణమంటూ ఆనాటి సంఘటనను ఏసిపికి గుర్తుచేసింది. దీంతో ఆయన కూడా తన సాయంతో బ్రతికిన మహిళను చూసి ఆనందం వ్యక్తం చేసారు. 

ఎవరూ లేని సమయంలో తనను తోడబుట్టిన సోదరుడిలా ఆదుకున్న ఏసిపి రవీందర్ కు రాఖీ కడతానని కవిత తెలిపింది. ఏసిపి ఫోన్ నంబర్ తీసుకున్న ఆమె వెండి రాఖీ కొనితెచ్చి తనకు ఆ దేవుడిచ్చిన సోదరుడు రవీందర్ కు కడతానని తెలిపింది. దాదాపు తొమ్మిదేళ్లు గడిచినా సాయంచేసిన వ్యక్తి ఫోటో పట్టుకుని కృతజ్ఞత తెలిపేందుకు వెతుకుతున్నట్లు కవితను చూపి అందరూ ఆశ్చర్యపోయారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios