దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే దిశ కేసు విచారణ  అధికారిగా వ్యవహరించిన పోలీసు అధికారి వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్: నగర శివార్లలో చోటుచేసుకున్న దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే దిశ కేసు విచారణ అధికారిగా వ్యవహరించిన పోలీసు అధికారి వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బదీలపై అసంతృప్తితోనే ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వివరాలు.. దిశ ఘటన చోటుచేసుకున్న సమయంలో సురేందర్ షాద్‌నగర్ ఏసీపీగా ఉన్నారు. దిశ కేసు విచారణ అధికారిగా పనిచేశారు. అయితే ఇటీవలి కాలంలో తరుచూ బదిలీలు కావడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. 

సురేందర్ కొన్నాళ్లుగా ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా పనిచేశారు. ఇటీవలే సైబరాబాద్ సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌‌కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన స్వచ్చంద పదవీ విమరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అయితే వీఆర్ఎస్‌కు వ్యక్తిగత కారణాలను చూపుతున్నప్పటికీ.. తరచుగా బదిలీలు, లూప్ లైన్ పోస్టింగ్‌లు పొందడం పట్ల సురేందర్ కలత చెందినట్టుగా తెలుస్తోంది. ఇక, సురేందర్‌కు మరో మూడేళ్ల సర్వీసు ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.