జీవితం మీద విరక్తితో ఓ మహిళా టెక్కీ బలవన్మరణానికి పాల్పడింది. తనకు బతకాలని లేదంటూ తన సోదరికి చెప్పిన రెండు రోజులకే మహిళా టెక్కీ.. ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నామాలగుండ ఉప్పరబస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి రంగన్‌ గోవిందరాజ్, శీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గోవిందరాజు సుస్మిత (21) క్లాక్‌టవర్‌ ప్రాంతంలోని టెక్‌ మహీంద్రాలో ఈ ఏడాది అక్టోబర్‌ 30న శిక్షణ కోసం చేరింది. శిక్షణ పూర్తయిన అనంతరం ఈ నెల 13న ఇక్కడే అసోసియేట్‌ కస్టమర్‌ సపోర్ట్‌గా విధులు నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం గోవిందరాజ్‌ కుమార్తెను తన ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి కార్యాలయం వద్ద వదలి వెళుతుంటారు. 

గురువారం కూడా యాదావిథిగా ఆఫీసుకు వచ్చింది. ఆఫీసుకి వెళ్లిన తర్వాత ఆరో అంతస్తులోని క్యాంటిన్‌కు వెళ్లి అక్కడి నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాత్రూం పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చైర్లు వేసుకుని పైకి ఎక్కి గ్రిల్స్‌ లేని కిటికి నుంచి కిందకు దూకింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

కాగా.. యువతి రెండు రోజుల క్రితం తన సోదరితో బతకాలని లేదని చెప్పడం గమనార్హం. ఆత్మహత్యకు ముందు కూడా తోటి ఉద్యోగినితో కూడా ఇలాగే మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఆమెకు ఇంట్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. పలు కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.