ప్రియుడితో వివాహం జరిపించాలని కోరుతూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఓ యువతి శుక్రవారం నాడు ప్రియుడితో పెళ్లి జరిపించాలని సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగింది.
భువనగిరి:ప్రేమించిన యువకుడితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఓ యువతి సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓ యువతి వలిగొండ మండలకేంద్రానికి చెందిన రావుల భాస్కర్ ప్రేమించుకొంటున్నారు. ప్రేమ పేరుతో తామిద్దరం సరదాగా తిరిగామని బాధితురాలు చెబుతోంది.
అయితే పెళ్లి చేసుకోవాలని కోరితే మాత్రం ససేమిరా అంటున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. మరో అమ్మాయిని భాస్కర్ పెళ్లిచేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడనే విషయం తెలుసుకొన్న బాధితురాలు శుక్రవారం నాడు సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగింది.
ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసినా తనకు న్యాయం జరగలేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతోనే తాను సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని బాధితురాలు చెబుతున్నారు.
అయితే న్యాయం చేస్తామని పోలీసులు బాధితురాలికి హమీ ఇవ్వడంతో ఆమె సెల్ టవర్ దిగింది. భాస్కర్ తో తన వివాహం జరిపించాలని ఆమె కోరుతోంది. అయితే భాస్కర్ కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడుతామని పోలీసులు ఆమెకు హామీ ఇచ్చారు. ఆ యువతి ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించింది. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే భాస్కర్ తనకు దూరమయ్యాడని ఆమె ఆరోపిస్తోంది.
