నిన్నటి వరకు ఆమె నిండు గర్భంతో ఉంది.. తెల్లారే సరికి ఆ గర్భం ఖాళీ అయ్యింది. కడుపులో బిడ్డ లేడు.. అలా అని ఆమెకు డెలివరీ కాలేదు.. అబార్షన్ కాలేదు.. అసలు కడుపు వచ్చిందా ఆమెకు అన్నట్లుగా ఉంది. ఏంటని అడిగితే.. దేవుడు తన కడుపులో బిడ్డను తీసుకెళ్లాడంటూ.. ఇంతా ఆయన మాయ అని చెబుతోంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన మంజులకు సమీప చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన చాలాకాలం తర్వాత 9నెలల క్రితం మంజుల గర్భం దాల్చింది. తాజాగా పురుడు కోసం తన పుట్టింటికి వెళ్లింది. 

శనివారం రాత్రి మంజులకు నొప్పులు వస్తుండటంతో స్థానిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లగా.. ఆమె పూనకం వచ్చినట్టు ఊగిపోయింది.

దీంతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోయారు. మరుసటి ఉదయం మంజులను ఆశావర్కర్లు పరీక్షించగా ఆమెకు గర్భం లేదని తేలింది. ఆస్పత్రిలో వైద్యుల పరీక్షలో ప్రసవం అయినట్టు కూడా ఆనవాళ్లు లేవని తేలింది.

మంజుల గర్భం దాల్చిన మాట వాస్తవమేనని ఆమె గర్భం దాల్చినప్పటి నుండి ఆమెను చికిత్సలు నిమిత్తం ప్రతినేల ఆసుపత్రిలో తీసుకొచ్చే ఆశ వర్కరు తెలిపారు.. నిన్నటి వరకు ఆమె గర్భంలో శిశువు ఉన్నమాట వాస్తవమేనని కాని ఈరోజు ఏమైందో తెలియదని అసలు నిన్న ఆమె మనోపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళిందో లేదో మాకు తెలియదని వారు చెప్పారు.

ఆమె వెంట వచ్చిన ఆశ వర్కర్లు మాత్రం నిండు కడుపుతో ఉంది. రాత్రి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చామని, మా కండ్లతో మేము చూశామన్నారు. ఆమె కడుపు ఎలా ఖాళీ అయ్యిందో మాకు అర్థం కావటం లేదన్నారు. తల్లి దండ్రులు, భర్త కూడా కూడా అదే విషయం చెబుతున్నారు.

ఆమె మాత్రం.. ఆ దేవుడు వచ్చి తన బిడ్డను తీసుకువెళ్లాడని చెప్పడం విశేషం.