ఆమెకు తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లయ్యింది. ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాగా.. దేశంలో కరోనా లాక్ డౌన్ రాగానే.. ఆమె భర్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తాను ఏదో ఫంక్షన్ కి వెళ్లాలని.. కరోనా ఉండటంతో చిన్న పిల్లలు బయట తిరగడం మంచిది కాదని భార్యను మాయ చేశాడు.

భార్యను కూతురిని పుట్టింటికి పంపి.. తాను తన తల్లితో ఫంక్షన్ కి వెళ్లివస్తానంటూ మార్చి నెలలో చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి భర్త నుంచి ఎలాంటి ఫోన్ కూడా రాలేదు. దీంతో... ఇటీవల ఆమె కుమార్తెతో కలిసి ఇంటికి వచ్చిచూడగా... ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వారిని అడిగితే ఇళ్లు ఖాళీ చేసారని చెప్పారు. దీంతో షాకైన సదరు వివాహిత న్యాయం కావాలంటూ ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముషీరాబాద్‌కు చెందిన వీణ, నారాయణగూడకు చెందిన మహేందర్‌ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 7 సంవత్సరాల కుమార్తె ఉంది. లాక్‌డౌన్‌ ప్రారంభం కాగానే భర్త, అత్త వీణను మార్చి నెలలో పుట్టింటికి పంపారు. కాగా ఆమె ఏప్రిల్‌ మాసంలో నారాయణ గూడలోని మెట్టింటికి రాగా తాళం వేసి ఉంది. అప్పటి నుంచి భర్త, అత్తలు ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు.  

భర్త, అత్తయ్య ఎక్కడ ఉన్నారో తెలియదని ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా, మెసేజ్‌ చేసినా సమాధానం ఇవ్వడం లేదని తెలిపింది. నారాయణగూడలోని పక్క వారిని అడిగితే మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారని వాపోయింది. ఇంట్లో తనకు సంబంధించిన బంగారం, డబ్బు, ఇతర సామగ్రి  ఉన్నాయని తనకు న్యాయం చేయాలని కోరుతూ వీణ ఇంటి ముందు బైఠాయించింది.