జహీరాబాద్: అత్తా అంటూ పలకరిస్తూ ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ఆమెను హత్య చేసిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. మద్యానికి బానిసైన అతను ఆమెను హత్య చేసిన నగలతో ఉడాయించాడు. అతను మరో మూడు నేరాలకు కూడా పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. 

తాండూరు రూరల్ సిఐ చింతల సైదిరెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ లక్ష్మయ్య అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని జీవన్గీ గ్రామంలో గత నెల 25వ తేదీన కుర్వ లక్ష్మి (35) అనే వివాహిత మహిళ హత్య గురైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎస్ఐ లక్ష్మయ్యకు ఏ విధమైన ఆధారాలు కూడా లభించలేదు. 

కాగా, ప్రియుడు సేవ్యానాయక్, అతని భార్య తిప్పిబాయిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి కొత్తూరు బాలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిని పోలీసులు విచారించారు. అయినా కేసు ముడి వీడలేదు. 

లక్ష్మి ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు హోటల్ ముస్తఫా అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో కేసు చిక్కు ముడి వీడింది. తానే డబ్బుల కోసం హత్య చేసినట్లు అతను అంగీకరించాడు.

హోటల్ ముస్తఫా కుర్వ లక్ష్మితో రెండు నెలలుగా సన్నిహితగా మెలుగుతూ వచ్చాడు. అంతా అంటూ శారీరక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి ఏడున్నర గంటల సమయంలో కుర్వ లక్ష్మిని ఇంటి బయట చూసి ఆమె దగ్గరకు చేరాడు. తన కోరిక తీర్చాలని అడిగి ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బండ రాయితో మోది హత్య చేసాడు. 

ఆమె ఒంటిపై ఉన్న ఆరు గ్రాముల బంగారు గుండ్లు, 16 తులాల వెండ కడియాలు, 12 తులాల వెండి పట్టగొలుసులు, సెల్ ఫోన్, రూ.5 వేల నగదు తీసుకుని వెళ్లిపోయాడు. మర్నాడు మధ్యవర్తుల సాయంతో బషీరాబాద్ లో వెండి ఆభరణాలను రూ.2500కు విక్రయించాడు. తాండూరులో రవిచంద్ర అనే మరో బంగారు ఆభరణాల వ్యాపరి వద్ద గుండ్లు కుదువ పెట్టి 16 వేల రూపాయలు తీసుకున్నాడు. 

ఆ డబ్బులతో కర్ణాటకలోని బీదర్ లో ఉన్న తన భార్య దగ్గరికి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత తిరిగి జీవన్గీ వచ్చాడు. అప్పటికే పోలీసులు సెల్ ఫోన్ డేటాతో నిందితుడి గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.