నార్సింగిలో మహిళ అదృశ్యం.. ఆరురోజులైనా ఆచూకీ లేదు..
హైదరాబాద్ లో ఓ మహిళ ఆరురోజులుగా కనిపించకుండా పోయింది. గత ఆదివారం సాయంత్రం ఇంట్లోనుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వెతుకుతున్నారు.
హైదరాబాద్ : నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతంలో ఓ మహిళ కనిపించకుండా పోయింది. గత ఆదివారం సాయంత్రం వేళ కూతురికి చేవి కమ్మలు కొనుక్కొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో రాత్రంతా వెతికి.. చివరకి సోమవారం నాడు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆరు రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబసభ్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెడితే...
మరియకుమారి (29) అనే మహిళ పుప్పాల గూడ, వినాయకనగర్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమెకు వివాహం అయి ఒక కూతురు కూడా ఉంది. పదో తరగతి వరకు చదువుకున్న మరియమ్మకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. సరిగా మతిస్థిమితం ఉండదు. దీంతో భర్తతో విభేదాలు వచ్చి.. కొన్నేళ్లుగా కూతురుతో కలిసి, తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మరియమ్మకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు ఉన్నారు. వీరంతా ఇదే కాలనీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
మరియమ్మ తల్లి ఇంట్లో పనులకు వెళ్లగా.. కూతురి కోసం తండ్రి ఇంటివద్దే ఉంటూ చూసుకుంటున్నాడు. మరియమ్మ తప్పిపోయిన రోజు కూడా తండ్రి ఇంటివద్దే ఉన్నాడు. తండ్రి చూస్తాడని అతనికి కనిపించకుండా ఇంట్లో నుంచి బయటపడింది. ఆ తరువాత నార్సింగికి వెళ్లింది. ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో తెలియదు. కూరగాయల మార్కెట్ కు వెళ్లిన తల్లి, చెల్లెళ్లు ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించకపోవడంతో వెతకడం మొదలుపెట్టారు. రాత్రంతా అన్ని చోట్లా వెతికి సోమవారంనాడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని, మిస్సింగ్ ప్రకటన కూడా విడుదల చేశారు. పోలీసులతో పాటు, కుటుంబసభ్యులూ వెతుకుతున్నారు. అయితే, తప్పిపోయిన నాలుగు రోజులకు మణికొండ, గోల్డెన్ టెంపుల్ దగ్గర కనిపించినట్లుగా అక్కడివారు మరియమ్మ తమ్ముడికి తెలిపారు. కానీ తప్పిపోయి ఆరు రోజులవుతున్నా ఇంకా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నార్సింగి ఎస్సై అనిల్, ఎఎస్సై రాజులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు మరియమ్మ తమ్ముడు యేసు సెల్. నెం. 9133608571కు వివరాలు తెలపాల్సిందిగా కోరుతున్నారు.