భర్తను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఇద్దరు పిల్లలతో మహిళ అనంతలోకాలకు...

First Published 5, May 2018, 12:47 PM IST
Woman meets mishap on wat airport to receive husband
Highlights

అతన్ని దురదృష్టం వెంటాడింది. తనకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం చెప్పడానికి వస్తూ భార్య, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్: అతన్ని దురదృష్టం వెంటాడింది. తనకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం చెప్పడానికి వస్తూ భార్య, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. టేకుమట్ల రాజేశం దశాబ్దం క్రితం ఉపాధి కోసం ఖతర్ తొలిసారి ఖతర్ వెళ్లి ఏడాదిన్నర తర్వాత తిరిగి వచ్చాడు.

రాజేశం అలా ఖతర్ వెళ్లి వస్తూ ఉన్నాడు. ఈసారి అతనికి విషాదమే మిగిలింది. ప్రతిసారీ తన పిల్లలకు తినుబండారాలు, ఆటవస్తువులు తెస్తూ ఉంటాడు. ఈసారి తన కుమారుడు శ్రవణ్ కోసం సైకిల్ కొనాలని అనుకున్నాడు.

అతని కోసం భార్యాపిల్లలు జగిత్యాల జిల్లాలోని స్వగ్రామం నుంచి కారులో బయలుదేరారు. తుర్కపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని శుక్రవారం ఉదయం ఢీకొట్టింది. 

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని షామీర్ పేట పోలీసులు అంటున్నారు. కారు డ్రైవర్ జె. రాజు (24), ఇద్దరు పిల్లలు శ్రవణ్ (12), శాలిని (10), పిల్లల తల్లి సత్తవ్వ ప్రమాదంలో మరణించారు. 

గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వారంతా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామం నుంచి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. 

ప్రమాదం జరిగిన వెంటనే ఓ మోటరిస్టు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడి వచ్చి క్రేన్ల సాయంతో కారులోంచి శవాలను వెలికి తీశారు. 

రాజేశం ఉదయం 5 గంటలకు విమానాశ్రయంలో దిగగానే పిడుగు లాంటి వార్త అందింది. ఓ దూరపు బంధువు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతని బాధ వర్ణనాతీతంగా ఉంది. 

loader