నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. భర్త శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని మూడు రోజుల పాటు మహిళ నివసిస్తూ వచ్చింది. తన భర్త చనిపోయాడని గుర్తించే మానసిక స్థితిలో కూడా ఆమె లేదు. ఈ సంఘటన బుధవారంనాడు తీవ్ర సంచలనం సృష్టించింది. 

రిటైర్డ్ విఆర్వో నోముల లింబారెడ్డి (70) తన భార్య శకుంతలతో కలిసి కంఠేశ్వర్ న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్నాడు. వారికి కుమారుడు సంతోష్ రెడ్డి ఉన్నాడు. ఆయన హైదరాబాదులో ఉంటున్నాడు. కూతురు ఇంగ్లాండులో ఉన్నారు. కొన్నేళ్లుగా శకుంతల మానసిక పరిస్థితి సరిగా లేదు. 

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎవరి ఇంట్లో వారే ఉంటూ వస్తున్నారు. లింబారెడ్డి ఇంట్లో రోజూ పాలు పోసే వ్యక్తి బుధవారం ఉదయం వచ్చాడు. శకుంతల తలుపులు తీసి బయటకు వచ్చింది. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో అతను ప్రశ్నించాడు. అయితే, సరైనా సమాధానం ఇవ్వలేదు. పక్కింటివారు వెళ్లి అడిగినా సరైన సమాచారం లేదు. 

చివరకు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసి లింబారెడ్డి మరణించినట్లు గుర్తించారు. అతను మూడు రోజుల క్రితమే మరణించినట్లు భావిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు భావిస్తున్నారు. 

మృతదేహంపై ఏ విధమైన గాయాలు లేవు, పోస్టుమార్టం నివేదికలోనూ ఏ విధమైన అనుమానాలు బయటపడలేదు. తనకు ఎవరి మీద కూడా అనుమానాలు లేవని, అనారోగ్యంతోనే మరణించాడని లింబారెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో హైదరాబాదు నుంచి వచ్చినట్లు తెలిపారు.