మేడ్చల్:ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ వివాహిత. నిందితులను అరెస్ట్ చేసినట్టుగా మేడ్చల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.

మేడ్చల్ జిల్లా రాజ బొల్లారం గ్రామపంచాయితీ అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ వెల్డింగ్ పనిచేస్తుంటాడు. అతడికి భార్య లక్ష్మి ఉంది. పిల్లలు లేరు. 2014లో కృష్ణ తన ఆటోను  అదే గ్రామానికి చెందిన గుంటి బాల్ రాజ్ కు విక్రయించాడు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తరచుగా బాల్ రాజ్ ఇంటికి కృష్ణ వస్తుండేవాడు.  

కృష్ణ భార్యతో బాల్‌రాజ్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కృష్ణకు తెలిసింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి.. తమ మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపానుకొంది లక్ష్మి. ఈ విషయాన్ని ప్రియుడు బాల్‌రాజ్ కు చెప్పింది.

అయితే భర్తకు పలుమార్లు నిద్రమాత్రలు ఇచ్చింది లక్ష్మి. కానీ, కృష్ణ మాత్రం అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు.  అయితే ఎలాగైనా భర్తను చంపాలని లక్ష్మి ప్రియుడిని కోరింది.

ఈ నెల 8వ తేదీన కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్నాడు. అదే అదనుగా భావించిన లక్ష్మి ప్రియుడు బాల్ రాజ్ కు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొంది. ఇంట్లో అలికిడి కావడంతో కృష్ణ లేచాడు. అయితే అప్పటికే ఇంటికి వచ్చిన ప్రియుడితో లక్ష్మి రాసలీలల్లో మునిగిపోయింది.

ఈ విషయాన్ని గుర్తించిన కృష్ణ  ఇంటి నుండి బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. అయితే లక్ష్మి, బాల్ రాజ్ లు కృష్ణను అడ్డుకొన్నారు. ఇస్త్రీ పెట్టె తీగను కృష్ణ గొంతుకు చుట్టి దారుణంగా హత్యచేశారని మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి  తెలిపారు.ఈ ఘటనపై విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు.