Asianet News TeluguAsianet News Telugu

అక్రమసంబంధానికి అడ్డుగా వున్నాడని... ప్రియుడితో కలిసి భర్తను కాల్చిచంపిన వివాహిత

వివాహేతర, అక్రమ సంబంధాల కారణంగా అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా పెద్దపల్లి జిల్లాలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా చంపి ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేసింది. 

Woman kills husband with help from lover in peddapalli district
Author
Godavarikhani, First Published Aug 21, 2022, 8:01 AM IST

పెద్దపల్లి : భర్తకు సింగరేణిలో ఉద్యోగం... ఇద్దరు పండంటి బిడ్డలు సంతానం.... ఇలా ఏలోటూ లేకుండా హాయిగా సాగుతున్న జీవితంలో ఓ వివాహిత చేజేతులా నిప్పులు పోసుకుంది. భర్తను కాదని మరో వ్యక్తి మోజులోపడి వివాహేతరసంబంధాన్ని సాగించింది. చివరకు తన అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేసింది. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే...  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని గంగానగర్ కు చెందిన రాజేందర్ (28) కు రవళితో ఏడేళ్ళక్రితం వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లయిన నాటినుండి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా వుండగా ఇటీవల కాలంలో రవళి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇందుకు వివాహేతర సంబంధమే కారణమని గుర్తించిన భర్త రవళిని గట్టిగా నిలదీసాడు. ఇలా పలుమార్లు భర్త అనుమానం వ్యక్తం చేయడం, గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటపడితే ఎక్కడ ప్రియుడికి దూరం కావాల్సివస్తుందోనని భయపడిపోయిన రవళి దారుణ నిర్ణయం తీసుకుంది. కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలను కాదని ప్రియుడితోనే వుండేందుకు సిద్దపడింది. ఇందుకు అడ్డుగా వున్న భర్తను హతమార్చేందుకు సిద్దమయ్యింది. 

సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న రాజేందర్ రోజూమాదిరిగానే గత శుక్రవారం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు రాజేందర్. రాత్రి అతడు పడుకున్న తర్వాత రవళి ప్రియుడికి సమాచారం అందించింది. శనివారం తెల్లవారుజామున మరొకడితో కలిసి ప్రియుడు బైక్ పై రాగానే రవళి ఇంటి తలుపులు తెరిచింది. దీంతో ఇంట్లోకి వెళ్లిన దుండగుడు నిద్రిస్తున్న రాజేందర్ ను అతి సమీపంనుండి గన్ తో కాల్చాడు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా రక్తపుమడుగులో పడి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం దుండగులిద్దరూ అక్కడినుండి పరారయ్యారు. 

తుపాకీ శబ్దం విని రాజేందర్ తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల ఇళ్లవారు గుమిగూడగా అప్పటికే రాజేందర్ మృతిచెందివున్నాడు. ఎవరో గుర్తుతెలియని దుండగులు భర్తపై కాల్పులు జరిపి పరారయ్యారని నమ్మించే ప్రయత్నం చేసింది రవళి. అయితే ఆమె వ్యవహారం గురించి అప్పటికే అందరికీ తెలియడంతో అందరూ ఆమెనే అనుమానించారు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టైల్లో రవళిని విచారించగా ప్రియుడితో కలిసి హతమార్చినట్లు అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట రవళి పుట్టిన వూరు. ఇదే గ్రామంలో రాజు అనే వ్యక్తి బెల్ట్ షాప్ నడుపుతుండేవాడు. అతడితో రవళికి పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసి చివరికి ఒకరి హత్యకు కారణమయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios