భర్తను చంపిన స్త్రీ: చపాతీ కర్రతో కొట్టి... నైలాన్ తాడుతో గొంతు బిగించి...

Woman kills her husband in Hyderabad
Highlights

భర్తను చంపిన భార్య ఉదంతం మరోటి చోటు చేసుకుంది. మద్యానికి బానిసై, వేధిస్తున్న భర్తను మహిళ చపాతీ కర్రతో కొట్టి, నైలాన్ తాడుతో గొంతు బిగించి చంపేసింది.

హైదరాబాద్: భర్తను చంపిన భార్య ఉదంతం మరోటి చోటు చేసుకుంది. మద్యానికి బానిసై, వేధిస్తున్న భర్తను మహిళ చపాతీ కర్రతో కొట్టి, నైలాన్ తాడుతో గొంతు బిగించి చంపేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. 

హత్యకు వాడిన కత్తి పీటను, నైలాన్ తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ డిసిపి ఎంవీ రావు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం వెలిజెర్ల గ్రామానికి చెందిన దేవలపల్లి వెంకటేష్ (45)కు సరూర్ నగర్ కు చెందిన దుర్గ అలియాస్ బుజ్జి అలియాస్ దుర్గతో 2000లో పెళ్లయింది. దంపతులు హైదరాబాదు వచ్చి భగత్ సింగ్ నగర్ లో దుర్గ తల్లి ఇంట్లో  స్థిరపడ్డారు.

వెంకటేష్ కూలీపనులు చేస్తుండగా, దుర్గ టైలర్ పని చేసేది. వారికి భవానీ (15), నవీన్ (13) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వెంకటేష్ మద్యానికి బానిసై తాగి వచ్చి భార్యను, పిల్లలను వేధించడం ప్రారంభించాడు. 

విసిగిపోయిన దుర్గ తల్లిదండ్రులను, సోదరుడు యాదగిరిని ఆశ్రయించింది. వారు వెంకటేష్ తో పెద్దల సమక్షంలో మాట్లాడారు. అప్పటి నుంచి దుర్గ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటూ వచ్చారు. 

అయినప్పటికీ వెంకటేష్ తన పద్ధతి మార్చుకోలేదు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు వెంకటేష్ భార్యతో గొడవ పడి రూ.500 తీసుకుని బయటకు వెళ్లి తాగిన మత్తులో రాత్రి 8 గంటలకు తిరిగి వచ్చాడు. 

భార్యతో గొడవకు దిగాడు. తనకు రూ.5 వేలు కావాలని వేధించాడు. మర్నాడు ఇస్తానని చెప్పినా వినలేదు. గొడవలో అతను భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. పిల్లలు ఇద్దరు తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, అతను ఆగ్రహంతో ఊగిపోతూ కత్తిపీట తీసుకుని వచ్చి చంపేస్తానంటూ బెదిరించాడు. 

దాంతో దుర్గ చపాతీ కర్రతో భర్త తలపై కొట్టి కత్తిపీట లాక్కుని దాడి చేసింది. దాంతో అతను కింద పడిపోయారు. తల్లిని అడ్డుకోవడానికి పిల్లలు ప్రయత్నించారు. అయితే, వారిని గద్దించి బయటకు పంపించి వేసింది. 

పడిపోయిన భర్త చనిపోలేదని భావించిన దుర్గ నైలాన్ తాడును తీసుకుని మెడకు బిగించింది. దాంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుర్గను శుక్రవారంనాడు అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు.  

loader