Asianet News TeluguAsianet News Telugu

ఆదిభట్లలో నిశ్చితార్థం రోజున యువతి కిడ్నాప్‌ ... అసలు ఎవరీ నవీన్‌రెడ్డి..!

హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో 24 ఏళ్ల యువతిని శుక్రవారం రోజున ఆమె నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ సమయంలో దాదాపు 50 మంది దుండగులు యువతి ఇంటి వద్ద నానా బీభత్సం సృష్టించారు. 
 

Woman Kidnapped on engagement day in Hyderabad and police rescue her with in hours
Author
First Published Dec 10, 2022, 10:06 AM IST

హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బీడీఎస్ చదువుతున్న 24 ఏళ్ల యువతిని శుక్రవారం రోజున ఆమె నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ సమయంలో దాదాపు 50 మంది దుండగులు యువతి ఇంటి వద్ద నానా బీభత్సం సృష్టించారు. అయితే వెంటనే స్పందించిన రాచకొండ పోలీసులు ఆరు గంటల్లోనే ఈ కిడ్నాప్ కేసును చేధించి.. యువతిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి కొందరు దుండగులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరికొందరి కోసం గాలింపు  కొనసాగిస్తున్నారు. 

వివరాలు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మన్నెగూడలో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు బీడీఎస్‌ చదువుతోంది. గతేడాది బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో ఆమెకు హస్తినాపురంలో నివాసం ఉంటున్న మిస్టర్‌ టీ కంపెనీ ఎండీ నవీన్‌రెడ్డి‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లి విషయంలో ఇరుకుంటాల మధ్య వివాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువతి నవీన్‌రెడ్డిని దూరంగా ఉంచింది. అయితే నవీన్‌ మాత్రం యువతిని విడిచిపెట్టలేదు. తరుచూ మెసేజ్‌లు చేసేవాడు. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం యువతి.. ఈ విషయంపై ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన నవీన్.. యువతి నివాసానికి సమీపంలో ఓ భవన నిర్మాణ పనులు ప్రారంభించాడు. అలాగే యువతిని వెంబడించడం, ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. తనను కాదంటే ఎవరికీ దక్కనివ్వనని ఆమెను బెదిరింపులకు పాల్పడేవాడు.ఇదిలా ఉంటే.. యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆమెకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం నిర్ణయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి.. నిశ్చితార్థం అడ్డుకునేందుకు ప్లాన్ వేశాడు.  పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు యువతి ఇంటికి చేరుకున్నాడు. తన వెంట పలు వాహనాల్లో దాదాపు 50 మందిని అక్కడికి తీసుకొచ్చాడు. నవీన్, అతని గ్యాంగ్ ఇంట్లోకి పరుగెత్తుతుండగా..  వైశాలి తల్లిదండ్రులు, బంధువులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే నవీన్ వెంట వచ్చినవారు యువతి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నీచర్, సమీపంలోని కార్లపై కూడా గ్యాంగ్ దాడికి పాల్పడింది. మరోవైపు నవీన్ రెడ్డి యువతిని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆమెను తీసుకుని కారులో వెళ్లిపోయాడు. దీంతో దాదాపు అరగంట పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి టీ అవుట్‌లెట్‌ను నిరసనకారులు తగులబెట్టారు. వారు సాగర్ హైవేపై బైఠాయించి.. యువతిని క్షేమంగా రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అనంతరం రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో యువతి తల్లి సుధీర్ బాబు కాళ్లపై పడి, తన కుమార్తె ఆచూకీ కనిపెట్టమని వేడుకుంది. ఇక, పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం యువతి  ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. ఆరు గంటల్లోనే ఆమె ఆచూకీని కనుగొన్నారు. నగర శివారు ప్రాంతంలో యువతిని ట్రాక్ చేసిన పోలీసులు.. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, కీలక నిందితుడు నవీన్ ఇంకా పరారీలో ఉన్నాడు.

యువతి తండ్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె నిశ్చితార్థం మధ్యాహ్నం షెడ్యూల్ చేయబడింది. అయితే ఆమెను అపహరించి ఉదయం 11:30 గంటలకు కారులో తీసుకెళ్లారు. ఇనుప రాడ్‌తో తలపై కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాను. నేను తేరుకునే సమయానికి నా కూతురు కనిపించలేదు. పలువురు కుటుంబ సభ్యులపై దుండగులు కూడా దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన కూడా స్పందించలేదు. దీంతో దుండగులు మరింత విధ్వంసానికి పాల్పడ్డారు’’ అని  చెప్పారు. 

అయితే గతేడాది యువతికి, తనకు వివాహం జరిగిందని నవీన్ రెడ్డి ఇదివరకే రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు వేశాడు. గతేడాది ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలోని దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం తాము పెళ్లి చేసుకున్నామని కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే యువతి తండ్రి ఆమె బీడీఎస్‌ పూర్తి చేసేంత వరకూ పెళ్లి విషయం బయట పెట్టవద్దని కోరారని చెప్పారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భార్యను బెదిరించి న ఆమె తల్లిదండ్రులు.. మరసు మర్చారని ఆరోపించాడు. 

నవీన్ రెడ్డి గురించి..  
కుడుదుల నవీన్‌రెడ్డి అలియాస్‌ కేఎన్‌ఆర్‌.. స్వస్థలం నల్గొండ జిల్లా ముషంపల్లి. నవీన్‌రెడ్డి విజయవాడలో సీఏ ఇంటర్‌ చేశాడు. ఆ తర్వాత వ్యాపారం వైపు అడుగులు వేశాడు. మిస్టర్‌ టీ స్థాపించాడు. హస్తినాపురంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశాడు. దేశవ్యాప్తంగా 400 వరకూ ఫ్రాంచైజీలు ఇచ్చాడు. స్వగ్రామంలో అతడికి ఇల్లుతో పాటు 4ఎకరాల భూమి ఉంది. నవీన్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి వ్యవసాయం చేసేవారు. అయితే 6 నెలల క్రితం తల్లిదండ్రులను సైతం నవీన్ రెడ్డి మన్నెగూడలోని ఇంటికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులతో నవీన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios