నల్లగొండ: తనను భర్త నుంచి కాపాడాలని వచ్చిన మహిళపై కన్నేసి, ఆమెపై ఒత్తిడి చేసిన పోలీసు అధికారికి చివరకు చెప్పు దెబ్బలు తిన్నాడు. భర్తతో మనస్పర్థలు వచ్చి మహిళ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. న్యాయం చేస్తానని నమ్మించి, చివరకు తన మనసులో కోరికను వెల్లడించాడు పోలీసు అధికారి. 

ఏఆర్ నుంచి సివిల్ కు బదిలీపై వచ్చిన ఓ అధికరి నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి భర్త సూర్యాపేటకు వెళ్లిపోయాడు. మహిళ పిల్లలతో నకిరేకల్ లో ఒంటరిగా ఉంటోంది. భర్త కోసం పోలీసు స్టే,న్ లో ఫిర్యాదుచేసింది.

యాభై ఏళ్ల వయస్సు గల ఆ పోలీసు అధికారి సంసారాన్ని చక్కబెడుతానని నమ్మబలికాడు. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయాలని చెప్పాడు. కొద్దికాలానికి అతని అసలు రూపం బయటపడింది. తన కామవాంఛ తీర్చాలని వేధించడం ప్రారంభించాడు. దాంతో మహిళ అతనికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ వచ్చింది. 

అయినా అతను వదిలిపెట్టలేదు. ఫోన్ లో బెదిరిస్తూ వచ్చాడు. అసభ్య పదజాలం ప్రయోగిస్తూ వచ్చాడు. దాంతో విసిగిపోయిన మహిళ ఓ ప్రజాప్రతినిధిని సంప్రదించింది. పోలీసు అధికారి తనతో జరిపిన సంభాషణను ఆమె తన ఫోన్ లో రికార్డు చేసింది.

శనివారంనాడు ప్రజాప్రతినిధి పోలీసు అధికారిని పిలిపించి సెల్ ఫోన్ రికార్డులు వినిపించాడు. దాంతో అతను తప్పయిందని అంగీకరించాడు. ఆ మహిళ అతన్ని చెప్పులతో కొట్టింది.