సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేయించింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఆమె భర్తను హత్య చేయించింది. ఈ నెల 6వ తేదీన సూర్యాపేట జిల్లా కోదడా శివారులో జరిగిన ఆ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 

కోదాడలోని రాజీవ్ నగర్ చెందిన మన్నూరి వెంకన్న (32)కు 13 ఏళ్ల క్రితం సైదమ్మతో వివాహం జరిగింది. వెంకన్న గ్యాస్ స్టవ్ మెకానిక్ గా మిర్యాలగుడాలో పనిచేస్తున్నాడు. సైదమ్మకు హైదరాబాదులో హోంగార్డుగా పనిచేస్తున్న బుడిగ సైదులతో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దానిపై వెంకన్న భార్యను మందలించాడు. 

ఏడు నెలల క్రితం మిర్యాలగుడా నుంచి వెంకన్న తన మకాంను కోదాడకు మార్చాడు దాంతో కోపం పెంచురకున్న సైదమ్మ భర్తను చంపించేందుకు మిర్యాలగుడాలో తాము నివాసం ఉంటున్న ఇంటి యజమాని కమలాకర్ ను సంప్రదించింది. అందుకు రూ.50 వేలు, రెండు తులాల బంగారం సుపారీగా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. 

ఈ నెల 6వ తేదీన కోదాడకు వచ్చిన కమలాకర్ వెంకన్నకు మత్తు టాబ్లెట్లు కలిపిన మద్యం తాగించాడు. ఆ తర్వాత రాయితో అతని తలపై మోది హత్య చేశాడు. వెంకన్న తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సైదమ్మను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే హత్య చేయించినట్లు ఆమె విచారణలో అంగీకరించింది.