ఓ వివాహితపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  గత సోమవారమే ఈ దారుణం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ఆమె ప్రియుడే నమ్మించి తన రూంకి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దిల్‌సుఖ్ నగర్ సమీపంలోని కొత్తపేటకు చెందిన ఓ వివాహిత (32) భర్తతో గొడవల కారణంగా అతడికి దూరంగా ఒంటరిగా వుంటోంది.  ఈ క్రమంలోనే ఆమెకు మనోజ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వారిద్దరు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. 

అయితే గతకొంత కాలంగా మహిళ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా మనోజ్ ను వేధించడం ప్రారంభించింది. ఈ విషయంపై వారిద్దరి మధ్య గొడవలు జరిగుతుండేవి. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న మనోజ్ దారుణానికి పూనుకున్నాడు. పెళ్లి గురించి మాట్లాడుకుందామని చెప్పి మనోజ్ ఆమెను ఓ స్నేహితుడ గదికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో మనోజ్ తో పాటు నలుగురు స్నేహితులు అత్యంత దారుణంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

ఈ దుండగుల చెర నుండి బయటపడ్డాక వివాహిత నేరుగా  వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్క పోలీసులు ఆమె ప్రియుడు మనోజ్ తో పాటు సిద్దార్థరెడ్డి, సతీష్, బాబీ, జంగారెడ్డి లను అరెస్ట్ చేశారు. బాదితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.