హైదరాబాద్: పెళ్లి పేరుతో అమెరికాలో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరును మోసం చేసిన మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ మాట్రిమోనీ ప్రొఫైల్ పెట్టి, అమెరికాకు వెళ్లడానికి అతని నుంచి అందినకాడికి సొమ్మును లాగింది ఆ యువతి. 

హైదరాబాదులోని బేగంపేటలో నివాసం ఉంటున్న అర్చన (30) ఫేక్ మాట్రిమోనీ ప్రొఫైల్ ను సృష్టించి, పవన్ కుమార్ అనే వ్యక్తిని సంప్రదించింది. ఆమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. 

తాను సిస్కోలో పనిచేస్తున్నానని, ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో గల ఓ కంపెనీలో ఖాళీలున్నాయని. తాను అక్కడికి మారాలని అనుకుంటున్నానని అర్చన పవన్ కుమార్ తో చెప్పింది. తన లగేజీని అక్కడికి మార్చడానికి 2,900 డాలర్లు (4 లక్షల రూపాయలు) పంపించాలని కోరింది. డబ్బును పంపించగానే పవన్ కుమార్ కూడా అందుబాటులోకి వెళ్లకుండా తప్పించుకుంది. జరిగిన మోసాన్ని గుర్తించిన పవన్ కుమార్ విషయాన్ని తన కజిన్ కు చెప్పాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అర్చన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులోని ఇనమడుగు సెంటర్. ఎస్వీ యూనివర్శిటీలో ఎంబిఎ చదివింది.  రంగనాయకులుపేటకు చెందిన కోరం దుర్గ ప్రవీణ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అతను నెల్లూరులో లెక్చెరర్ గా పనిచేస్తున్నాడు. 

పెళ్లి పేరుతో అమాయకులను మోసం చేసిన కేసులో అర్చన గతంలో అరెస్టు కూడా అయింది. ఐదు నెలలకు పైగా జైలులో ఉండి 2018 డిసెంబర్ లో విడుదలైంది.  నెల్లూరుకు చెందిన కోరం అర్చన అలియాస్, జూటౌరి వరప్రసాద్ అర్చన అలియాస్ జూటౌరి ఇందిరా ప్రియదర్శిని అలియాస్ పుస్తయి తన పెళ్లి తర్వాత తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఫేక్ మాట్రిమోనీ ప్రొఫైల్స్ ను తెలుగు మాట్రిమోనీ సైట్లలో పెడుతూ ఎన్నారైలకు వల వేస్తూ వచ్చింది.