అతనికి అప్పటికే పెళ్లి అయ్యింది. ఆమెను కాదని మరో మహిళను పెళ్లాడాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. సరే... మొదటి భార్యను ఎలాగూ పట్టించుకోలేదు.. కనీసం రెండో భార్యనైనా బాగా చూసుకున్నాడా అంటే అదీ లేదు. శరీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతనిలోని శాడిజయం బయటపడిన తర్వాత... అతను మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదన్న విషయం ఆమెకు తెలిసింది. దీంతో తనకు న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వైజాగ్ కి చెందిన మహిళ(37) 2018 మార్చి 8న శివరాం రెడ్డి అనే వ్యక్తితో యాదగిరిగుట్టలో పెళ్లి జరిగింది. అనంతరం వారు విశాఖపట్నం మహారాణిపేట అఫీషియల్ కాలనీలో కాపురం పెట్టారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే... నిన్ను పెళ్లి చేసుకున్నానంటూ శివారాం చెప్పిన మాటలను ఆమె పూర్తిగా నమ్మింది.

అయితే కొద్ది నెలల్లోనే నిజం వెల్లడి కావడంతో అతడిని నిలదీసింది. అలా నిలదీసినందుకుగాను రోజూ మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. 
 దీనికితోడు ఐబీఎంలో మేనేజర్‌గా పని చేస్తున్న తనను ఉద్యోగం మాన్పించి వైజాగ్‌లో కాపురం పెట్టాడని కొద్ది రోజుల్లోనే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. 

తన వద్ద నుంచి విడతల వారీగా రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. మీలాంటి లోక్లాస్‌ మహిళను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని నీ జీతం నా ఒక్కరోజు ఖర్చుతో సమానమని అవమానించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె గత జూన్‌ 24న హైదరాబాద్‌ వచ్చి శివరాం రెడ్డి కుటుంబ వివరాలు ఆరా తీయగా అతను మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైందని ఆమె తెలిపింది. 

 దీనికితోడు  కారు రుణం చెల్లించలేకపోవడంతో బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పేందుకు ప్రయత్నించగా అతను అందుబాటులోకి రాలేదు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.