వారిద్దరూ రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి తమ వయసు సరిపోదని... మేజర్లు అయ్యేంతవరకు ఎదురు  చూశారు. మేజర్ అయిన మరుసటి రోజే ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన ఎనిమిది నెలలకే అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువు ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా పెంచికల్ పేటకు చెందిన గడ్డం మౌనిక(19), దండేపల్లికి  చెందిన ఆటో డ్రైవర్ పానుగంటి చందురెడ్డి రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మౌనిక మైనార్టీ తీరి.. ఆమె మేజర్ అయిన మరుసటి రోజే.. వారు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే.. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఎలాగైనా వారిని మీరే ఒప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా దండేపల్లిలో కాపురం పెట్టారు.

Also Read కాళ్లు పట్టుకున్నా వదలకుండా... విద్యార్థిపై దంపతుల దాడి...

కొద్ది రోజులపాటు వారి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాతి కొద్ది రోజుల నుంచి మౌనికను ఎలాంటి కట్నకానుకలు తీసుకు రాలేదని భర్త పానుగంటి చందురెడ్డి, అత్త సుజాత, మామ పానుగంటి తిరుపతి రెడ్డిలు వేధింపులకు గురిచేసినట్లు మౌనిక బంధువులు ఆరోపించారు. 

భర్త, అత్తమామ వేధింపులు భరించలేక రెండు రోజుల క్రితం ఆమె పురుగుల మందు తాగి అపస్మారక స్ధితిలోకి వెళ్లగా చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తూ మార్గ మధ్యలోని ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌లో మౌనిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసి వెళ్లారు. 

అనంతరం కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మౌనిక మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.