ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య.. హత్యే అంటోన్న యువతి తల్లిదండ్రులు
హైదరాబాద్ జవహర్ నగర్‌లో ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డను ఆమె ప్రియుడే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో ఈ ఘటన జరిగింది. దయాకర్ , పూజ అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం ఇరువురి పెద్దలకు తెలిసింది. దీంతో దయాకర్, పూజల పెళ్లికి దయాకర్ తల్లిదండ్రులు నిరాకరించారు. అయితే ఎలాగైనా తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించాలన్న ఉద్దేశంతో పూజను దయాకర్ తన ఇంటికి తీసుకొచ్చాడు.
కానీ అతని తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అనడం, కాస్త కఠినంగా మాట్లాడేసరికి పూజ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ వెంటనే దయాకర్ ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దయాకర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ కుమార్తెను దయాకరే చంపాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూజను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని పలు కోణాల్లో విచారిస్తున్నారు.