తన ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి సొంత పెద్దమ్మ ఇంటికే కన్నమేసింది. తన మీద అనుమానం రాకుండా పెద్దమ్మకు సేవలు చేస్తూనే.... స్నేహితుల చేత భారీ స్కేచ్ వేసి నగలు, డబ్బు చోరీ చేయించింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని రాంనగర్ లో చోటుచేసుకోగా.... నిందితులను పోలీసులు  చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పిళ్లా వినయకుమారి రాంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో కుమార్తెతో కలిసి నివాసముంటున్నారు. వినయకుమారికి వరసకు కుమార్తె అయ్యే కుష్బూ అనే యువతి తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేది. కాగా... కుష్బూకి ఇటీవల ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆమె తన పెద్దమ్మ వినయకుమారి ఇంట్లో చోరీకి ప్లాన్ వేసింది.

దీని కోసం తన స్నేహితులు సూర్య, వంశీ సాయం తీసుకుంది. ఇంట్లో బంగారం ఎక్కడుంటుంది, డబ్బు ఎక్కడ ఉంటుంది అన్ని విషయాలను ముందుగానే తన మిత్రులకు చేరవేసింది. అనంతరం పథకం ప్రకారం పెద్దమ్మకు నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అవి మోతాదు ఎక్కువ కావడంతో ఆమె అస్వస్థతకు గురయ్యింది. 

తెలివిగా ఇంటి తాళం తన స్నేహితులకు ఇచ్చేసి.. పెద్దమ్మను ఆస్పత్రిలో చేర్పించి సేవలు చేసింది. వీళ్లు ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే.. కుష్బూ స్నేహితులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈనెల 23న ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన వినయకుమారి బీరువాలో ఉన్న బంగారం, నగదు కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుష్బూపై అనుమానంతో ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆమెతో  పాటు సహకరించిన సూర్య, వంశీని అరెస్ట్‌ చేసి 53.8 తులాల బంగారం, రూ.5.25లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.