గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు సదరు మహిళ తలపై బలంగా మోది హత్య చేశారు. కాగా.. అనంతరం సదరు మహిళ మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి.. బోరబండలోని సున్నం చెరువులో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్య వివరాలు ఇలా ఉన్నాయి.

శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో సున్నం చెరువులో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చెరువులోకి మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె వయసు 30ఏళ్లకు పైగా ఉంటాయని భావిస్తున్నారు.

ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టేసి చెరువులో పడేసినట్లు గుర్తించారు. తలపై గట్టిగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. హత్య జరిగి నాలుగైదు రోజులు గడిచినట్లు తెలుస్తోంది. మృతదేహం దాదాపు కుళ్లిపోయింది. ఆమె ఒంటిపై కుర్తా పైజామా ఉన్నాయి. కాగా.. ఆమె చేతిపై ఓ పచ్చబొట్టు ఉందని.. దాని ఆధారంగా మహిళ ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.