మామ కి వచ్చిన పెన్షన్ డబ్బు కోసం భర్తతో గొడవ పడింది ఓ ఇల్లాలు. ఈ క్రమంలో మాటామాట పెరిగిపోయి.. కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్బెన మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన చింతకుంట శ్రీనివాస్(34) అనే వ్యక్తికి భార్య అంజలి అలియాస్‌ స్వప్న ఉంది. ఈ దంపతులు గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఏడు సంవత్సరాల కుమారుడు, ఐదు సంవత్సరాల కూతురు ఉన్నారు. వీరితోనే శ్రీనివాస్‌ తండ్రి పోచయ్య కూడా ఉంటున్నాడు. అయితే దంపతులిద్దరూ మద్యానికి బానిసయ్యారు.

మంగళవారం పోచయ్యకు వృద్ధాప్య పెన్షన్‌ రాగా అతని వద్ద నుంచి కుమారుడు శ్రీనివాస్‌ రూ.600 తీసుకుని ఖర్చు చేశాడు. అదే రోజు సాయంత్రం పెన్షన్‌ డబ్బుల విషయంలో శ్రీనివాస్‌, అంజలి మధ్య వివాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొడుకు అరుపులు వినిపించడంతో పోచయ్య వెళ్లి చూశాడు. అంజలి కొడవలితో శ్రీనివాస్‌ను నరకడం గమనించిన పోచయ్య కేకలు వేయడంతో ఆమె పారిపోయింది. పోచయ్య దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెబ్బెన సీఐ ఆకుల అశోక్‌ తెలిపారు.